గ్రామ సభ తీర్మానాన్ని అమలు చేయొద్దు

స్వేచ్ఛ న్యూస్, జనవరి 31, నార్కెట్ పల్లి: హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం సర్పంచ్ ప్రమేయం లేకుండా నిర్వహించిన అత్యవసర పాలకవర్గ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను అమలు పరచకుండా నిలిపివేయాలని కోరుతూ సోమవారం నార్కెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇటీవల సర్పంచ్ గా సస్పెండ్ అయి హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్న దూదిమెట్ల స్రవంతి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సోమవారం ఉదయం విధులలో చేరిన నాకు ఎలాంటి సమాచారం లేకుండా నా ప్రమేయం లేకుండా పాల పాలకవర్గ సమావేశం నిర్వహించడం హైకోర్టు ఉత్తర్వులను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులపై చట్ట పరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు.

సస్పెన్షన్ పై స్పందిస్తూ… సర్పంచ్ పదవి సస్పెన్స్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అధికారులు ప్రొసీజర్ ప్రకారం బిల్లులు సమర్పించడంలో తప్పిదాలు జరిగినట్లు మొత్తం 38 అభియోగాలు లేవనెత్తారని అందులో 14 అభియోగాలు రెవెన్యూ స్టాంపులు సరిగా లేవని, మరో 14 ఆభియోగాలు పంచాయతీరాజ్ ఎఇ సంతకాలు లేవని మరో 10 అభియోగాలలో (Dates)డేట్లు సరిగ్గా రాయలేదని చెబుతూ సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి ప్రొసీజర్ మిస్టేక్స్ ను పంచాయతీ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులు సరిచూసుకొని బిల్లులు పాస్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుందని ఆ ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలా కాకుండా సర్పంచ్ ను బాధ్యురాలిని చేస్తూ పదవి నుంచి తొలగించడం బాధాకరం అన్నారు. గ్రామపంచాయతీలో బిల్లులు పాస్ కావాలంటే సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉండాలని అలా ఉన్నప్పుడు సర్పంచ్ ఒక్కరిని బాధ్యులను చేయడం ఏమిటని, ప్రతి బిల్లును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దఖలు పరుస్తారని అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

రాజీనామాకు సిద్ధం… గత మూడు సంవత్సరాలుగా నేను చేసిన సేవలు నార్కట్పల్లి గ్రామ ప్రజలకు తెలుసని వారి ఆకాంక్ష మేరకు పని చేయడం నా ధర్మం అని పేర్కొన్నారు. ప్రజలల్లో నాపై ఉన్న ఆదరణను బలహీన పరిచేందుకు కుట్రలు చేయడం తగదన్నారు. దొంగ దారులలో పీఠం ఎక్కే బదులు ప్రజాక్షేత్రంలో పోరాడుదాం అని అవసరమైతే రాజీనామాకు సిద్ధం అని తెలిపారు.

బందోబస్తు మధ్య పాలక వర్గ సమావేశం నిర్వహణ… హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ గా విధులు నిర్వహించేందుకు వచ్చిన దూదిమెట్ల స్రవంతి అదే సమయంలో ఇంచార్జ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించే పాలక వర్గ సమావేశం ఉన్నందువల్ల కొద్దిసేపు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *