చెరువుగట్టు దేవస్థానం సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 2, నార్కెట్ పల్లి: ఈ నెల 8 మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయ్యే చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి లు అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై బుధవారం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా మూడో విడత ప్రభావంతో బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయమై నిర్ణయం ఆలస్యమైందని తెలిపారు. నిర్వహణ ఏర్పాట్ల కు తక్కువ సమయం (5 రోజులు) మాత్రమే ఉన్నందున వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు.

దేవస్థానం సిబ్బంది పై మండిపడ్డ ఎమ్మెల్యే … దేవస్థానం సిబ్బంది తమ వీధులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఒక్కరు కూడా విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని ప్రతి ఒక్కరూ తనకేమీ సంబంధం లేనట్టుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఒకరికొకరు సమన్వయం చేసుకొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని లేని ఎడల రెగ్యులర్ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అనే తేడా లేకుండా మెమో జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

పారిశుధ్యం పై ప్రత్యేక చర్చ… బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పంచాయతీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్టపైన దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి పనులు అప్పగించి జాతర పూర్తయ్యేవరకు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీటి సరఫరా, మూత్రశాలల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వైద్యదికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కరోనా వ్యాక్సిన్ నేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

భక్తుల గౌరవానికి భంగం కలిగించవద్దు… స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వస్తారని అలా దూర ప్రయాణం చేసి వచ్చిన భక్తులు అలసి పోవడం వల్ల గుట్టపైకి వాహనాలను అనుమతించాలని పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తారని అలాంటి సందర్భంలో పోలీసులు వారిపై కసురుకోకుండ సహనంతో వారిని సమాధానపరచి తగు సూచనలతో స్వామివారి దర్శనం సక్రమంగా జరిగేలా చూసుకోవాలన్నారు. వీఐపీలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి గట్టుపైకి తీసుకువెళ్లాలన్నారు. ఆటోలలో కొన్నింటిని బస్ స్టాప్ నుంచి గట్టుపైకి నడిచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తద్వారా నడవలేనివారు ఆటోలో సౌకర్యంగా ప్రయాణిస్తారని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు, శాంతి భద్రతలకు భంగంవాటిల్లకుండా పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యతారాహిత్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

వ్యాపారులకు సూచనలిస్తున్న సిఐ శివ శంకర్ రెడ్డి

షాప్ ల నిర్వాహకులకు సూచనలు… గట్టు కింద అ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వారికి కేటాయించిన స్థలంలోనే షాపులు నిర్వహించుకోవాలని ఒక్క అడుగు ముందుకు వచ్చిన ఎలాంటి సమాచారం లేకుండా తీసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకు గ్రామస్తులు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరు సహకరించి జాతరను విజయవంతం చేయాలని డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి సుదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీవో జగదీశ్వర్ రెడ్డి, చెరువుగట్టు దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ మల్గ బాలకృష్ణ, సీఐ శివ శంకర్ రెడ్డి, ఎస్సై రామకృష్ణ, పాలక మండలి సభ్యులు పసునూరి శ్రీనివాస్, రాదారపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ మండపం పరిసర ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఆర్ డి ఓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *