ఎడ్ల బండి ఎక్కిన ఎమ్మెల్యే వీరేశం

స్వచ్ఛ న్యూస్, మార్కెట్ పల్లి, ఫిబ్రవరి 22: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా గ్రామీణ ప్రజలు పండగలకు (జాతరలు) గుడి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పడం ఆనాదిగా వస్తున్న ఆచారం అందులో భాగంగా గురువారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ, మల్లన్న దేవుని జాతర సందర్భంగా చివరి రోజు గ్రామస్తులు ఎడ్ల బండ్లు కట్టి దేవతల చుట్టు ప్రదక్షిణ చేపిస్తుండగా అక్కడికి వచ్చిన నకిరేకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వెంటనే ఎంతో ఆనందంతో ఎడ్ల బండి ఎక్కి ఆనందంతో పరవశించిపోయారు అది చూసిన అభిమానులు ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వంతో తన మూలాలను మర్చిపోలేదని కొనియాడారు. ఎమ్మెల్యే వేముల వీరేశం తాను కూడా సాధారణ పౌరునిగా జీవిస్తాడు అని చెప్పేందుకు మరో నిదర్శనంగా ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం యాదవ సంఘం సభ్యులతో మాట్లాడుతూ పది లక్షల రూపాయలతో గుడి వరకు సిసి రోడ్డు నిర్మిస్థానని హామీ ఇచ్చారు.

Share this…

కోర్టు తీర్పును గౌరవిస్తూ కూరగాయల అంగడి స్థలాన్ని గ్రామపంచాయతీ వారు స్వాధీనపరచుకోవాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఫిబ్రవరి 22 : నార్కెట్పల్లి మండల కేంద్రంలోని కూరగాయల అంగడి స్థలం విషయంలో కోర్టు తీర్పుకు లోబడి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం నకిరేకల్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా నార్కెట్పల్లికి చేరుకున్న ఆయనకు. నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు కూరగాయల అంగడి స్థలం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకంఠం భూమినీ అక్రమార్కులు కాజేయాలని చూడగా గ్రామస్తులు అడ్డుకొని అది ప్రజలందరికీ చెందాల్సిన ప్రభుత్వ ఆస్తి అని పోరాడుతుంటే వారికి మతం రంగు పూసి కమ్యూనల్ కేసులు పెట్టి బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అంగడి స్థలం సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించే వరకు మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అవసరమైతే మరోసారి వచ్చి విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Share this…

పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించిన : ఎన్ పి ఎస్

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఫిబ్రవరి 14 : 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో భారత జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ బుధవారం నార్కెట్పల్లి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి నల్గొండ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్పీఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఐక్యరాజ్యసమితిలో స్పష్టమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్త సమస్యల్లో మతోన్మాద ఉగ్రవాదం తీవ్రస్థాయిలో పెరుగుతుందని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయకపోతే భవిష్యత్తులో మానవ మనుగడ కష్టమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోముల నాగరాజు, నడింపల్లి శ్రవణ్, గూడూరు అంజిరెడ్డి, పాలకూరి రమేష్, జమాండ్ల నవీన్ రెడ్డి, కొప్పు ప్రవీణ్, గండికోట రాజు, కొరివి శంకర్, రాగిరి శివశంకర్, మునుకుంట్ల గణేష్, కన్నెబోయిన నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Share this…

నార్కెట్పల్లి లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి జనవరి 30 : నార్కెట్పల్లి మండల కేంద్రంలో స్ఫూర్తి కాలేజ్ పక్కన గురిజ అశోక్ స్వామి ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతరను మంగళవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరలో మంగళవారం ఉదయం హోమం తో ప్రారంభమై 11 గంటలకు పుట్ట బంగారం, రాత్రి 9 గంటలకు గంగతెప్ప కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బుధవారం ఉదయం 6 గంటలకు రేణుక ఎల్లమ్మ కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు సమ్మక్క సారక్క గంగాస్నానం, సాయంత్రం 6 గంటలకు ఎదురులంక నుండి గద్దెల వరకు అమ్మవార్లను తీసుకురావడం, 9:30 గంటలకు ఎత్తుబంగారం కార్యక్రమం, 10:30 కు సమ్మక్క సారక్కలకు నలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు వడిబియ్యం కార్యక్రమం తో జాతర ముగుస్తుందని అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుడు అశోక్ స్వామి తెలిపారు.

Share this…

కూరగాయల అంగడి స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి

నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణంలోని కూరగాయల అంగడి స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి పూర్తి స్థాయిలో ఆ భూమిని ప్రజా అవసరాలకు వాడాలని కోరుతూ నార్కెట్పల్లి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నార్కెట్పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ నార్కెట్పల్లి మండల కేంద్రంలో ప్రజలందరూ వినియోగించుకునేందుకు ఉన్న ఒకే ఒక్క స్థలం కూరగాయల అంగడి స్థలమని దాన్ని కూడా ఆక్రమించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఆ భూమిని ప్రజా అవసరాలకు వినియోగించే విధంగా గ్రామపంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 2023 జూన్ నెలలో గ్రామపంచాయతీ పాలకవర్గం అక్రమ నిర్మాణాలను తొలగించాలని తీర్మానం చేసినప్పటికీ ఆరు నెలల నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారని ఇప్పటికైనా స్పందించకుంటే భవిష్యత్తులో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

Share this…

ఆపదలో ఉన్న పూర్వ విద్యార్థులను ఆదుకోవడమే స్వాన్ లక్ష్యం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 7: ఆపదలో ఉన్న పూర్వ విద్యార్థులను ఆర్థికంగా, కెరియర్ పరంగా ఆదుకోవడమే లక్ష్యంగా స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కెట్పల్లి) ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకుడు మామిళ్ల సత్తిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నార్కెట్పల్లి మండల కేంద్రంలోని శబరి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన స్వాన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కెట్ పల్లి లో చదువుకున్న పూర్వ విద్యార్థుల అందరిని కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ఆర్థిక సహాయాలు, కెరియర్ గైడెన్స్, వారి పిల్లల ఉన్నత చదువులు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 9:30 గంటలకు స్థానిక జడ్పీహెచ్ఎస్ లో పూర్వ విద్యార్థులందరూ కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వందేమాతరం పాడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో చెట్లను నాటి అక్కడి నుంచి కార్యక్రమం నిర్వహించే శబరి గార్డెన్ వరకు ర్యాలీగా వెళ్లారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పూర్వ విద్యార్థులలో దురదృష్టవశాత్తు తమకు దూరమైన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు స్వాన్ ఏర్పాటు ఉద్దేశం భవిష్యత్తు కార్యచరణ పై ప్రసంగించారు. స్వాన్ లక్ష్యం ఉన్నతంగా ఉందని మనకోసం మనం అనే నినాదంతో ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ ఇదే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని క్రమశిక్షణతో నడవాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్, జలసాధన సమితి నాయకులు దుశ్చర్ల సత్యనారాయణ, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వనజాత, పృద్విరాణి, సుజాత, లక్ష్మి, ఉదయశ్రీ, హైమావతి, శ్రీరాములు, యాదగిరి రెడ్డి లు అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం కోవిడ్ సమయంలో జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ గా పదవీ విరమణ పొందిన పృథ్వి రాణి ఉపాధ్యాయురాలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధులచే స్వాన్ తరఫున ముద్రించిన 2024వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అదేవిధంగా 2003 బ్యాచ్ కి సంబంధించిన ఓర్సు విష్ణు దంపతులు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో వారి పిల్లలకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన 2010 బ్యాచ్ కి చెందిన ఆదిమల్ల లోకేష్ చెల్లెలు శివానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 1995- 96 బ్యాచ్ నుంచి 2018 బ్యాచ్ వరకు పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Share this…