పంచాయితీ కార్యదర్శులతో వెట్టిచాకిరి చేయిస్తున్న ప్రభుత్వం: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
స్వేచ్ఛ న్యూస్, మే 1, నార్కెట్పల్లి:
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న దీక్ష 4వ రోజుకు చేరిన సందర్భంగా సోమవారం నార్కెట్పల్లి లో వారికి సంఘీభావం ప్రకటించిన ఆర్ఎస్పి మాట్లాడుతూ గత 4 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేస్తున్న సమ్మెలో ఆటలాడుకోవాల్సిన పసిపిల్లలు తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మెబాట పట్టడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించి ఇతర ఉద్యోగాలకు వెళ్లకుండా తమ ఉద్యోగానికి భద్రత లేక వారు పడుతున్న మానసిక ఆందోళన వర్ణనాతీతమణి ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిత్యం అందుబాటులో ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి హరితహారం, పల్లెప్రకృతివనం, తదితర ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని అయినా తమ కష్టంతో విజయవంతం చేస్తున్న వీరిపై కనీస గౌరవం లేకపోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని వీరి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. దొర పోకడలతో గతంలో చేసిన ఉద్యమాలను నీరు గార్చినట్లు వీరి ఉద్యమాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. క్రింది స్థాయి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేసే ఏ ఉద్యమానికైనా బిఎస్పి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జూనియర్ పంచాయతి కార్యదర్శుల క్రమబద్దీకరణ కార్యాచరణలో బాగంగా నార్కట్ పల్లి మండల జూనియర్ పంచాయితీ కార్యదర్శులు 4 వ రోజు సమ్మెలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, నార్కట్ పల్లి మండల జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఏ. నరేష్, బి.వెంకన్న, గీతాంజలి, రాంబాబు, శామ్యూల్, ఆంజనేయులు, సుమలత, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!