నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 25, నల్లగొండ: పేదరికంలో ఉన్న నిరుద్యోగ యువతకు గ్రూప్స్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని కెవికె ఫౌండేషన్ చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్ పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసుకొని ఆర్దికంగా వెనుకబడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని స్టేఇన్ హోటల్ లో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణకు సంబందించిన వివరాలను వెల్లడించారు. అన్ని అర్హతలు ఉండి వేలాది రూపాయలు వెచ్చించి ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ పొందలేని పేద, మధ్య తరగతి నిరుద్యోగుల కోసమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆశయాలు సాధించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని VMR లాజిక్స్ అనే శిక్షణా కేంద్రం ద్వారా ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇప్పించనున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రూప్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా తమ ఆదాయ ధృవీకరణ పత్రంతో తమ కు దరఖాస్తు చేసుకుంటే వచ్చేనెల 6వ తేదీన స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేస్తామని అన్నారు. మే 10వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కోచింగ్ ప్రారంభిస్తామని విజయ్ కుమార్ తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా భవిష్యత్తులో తమకు తోచిన విధంగా మరికొంతమందికి సాయం చేయగలిగితే చాలని అన్నారు. అనంతరం శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!