చనిపోయిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక భరోసానే లక్ష్యంగా కుటుంబ భరోసా పథకం
స్వేచ్ఛ న్యూస్, అక్టోబర్ 31, నల్గొండ: ప్రతినిత్యం కాలంతో ప్రయాణిస్తూ కుటుంబాన్ని గడుపుతున్న ఫోటోగ్రాఫర్ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో గాని మరే ఇతర కారణం చేతనైన మరణించినట్లయితే ఆ ఫోటోగ్రాఫర్ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడొద్దు అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిందే ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం అని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పట్టణ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రాష్ట్ర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ సలహాదారు పున్న రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ లతో కలిసి నార్కెట్పల్లి కి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ యాళ్ల మల్లేశం, నల్లగొండకు చెందిన ఫోటోగ్రాఫర్ నూకల శంకర్ కుటుంబాలకు 1 లక్ష 55 వేల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హుస్సేన్ మాట్లాడుతూ దినదిన గండం ప్రవర్థమానంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న ఫోటోగ్రాఫర్ లు ఇటీవల మారిన జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, లేదా రోడ్డు ప్రమాదాలు తదితర కారణాల చేత మృతి చెందుతున్నారని అలా మృతి చెందిన ఫోటోగ్రాఫర్ల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోకుండా కాపాడటమే లక్ష్యంగా గత 2 సంవత్సరాల క్రితం మనకోసం మనం అనే నినాదంతో ఏర్పాటు చేసుకున్న ఫోటోగ్రఫీ కుటుంబ భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన 76 మంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు సుమారు 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. 2 సంవత్సరాల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేయడం రాష్ట్ర, దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సంఘం ద్వారా కూడా సాధ్యం కాలేదని తెలిపారు. ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ కేవలం 10 రూపాయల కంట్రిబ్యూషన్ తో ఈ సహాయం అందజేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సంఘాలు, మండల సంఘాలు, సభ్యత్వం ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కృషి వెలకట్టలేనిదని ఫోటోగ్రాఫర్ల సహకారాన్ని అభినందించారు. అతి త్వరలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అధిక మొత్తంలో లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అసోసియేషన్ కోశాధికారి పున్న విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గుమ్మడవెల్లి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి కృష్ణ, పట్టణ అధ్యక్షులు పుట్ట మోహన్ రెడ్డి, కుటుంబ భరోసా జిల్లా ఇన్చార్జి సుమన్, నార్కెట్పల్లి అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ, ప్రధాన కార్యదర్శి గౌరీదేవి నరసింహ, కోశాధికారి నీలం శివరాం, నాయకులు సోమ వెంకటరెడ్డి, మనోహర్, వేణుమాధవ్, లక్ష్మణ్, అనురాధ, శోభ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!