బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 23: ఈనెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సందర్భంగా గురువారం జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ యూపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ సింగ్ మీనన్ ఆయా పోలింగ్ స్టేషన్లను స్థానిక సీఐ మహేష్, ఎస్సై సైదాబాబు లతో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే బైండోవర్ చేయాలన్నారు. గత ఎన్నికలలో జరిగిన వివాదాల గురించి విచారించారు. ఈనెల 30న జరగబోవు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టిందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.