ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 28: చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల శివనామ స్మరణాలతో గట్టు ప్రాంతం మారు మ్రోగుతుండగా అర్చకులు ఆచారం ప్రకారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వకాల ఆచారం ప్రకారం రామన్నపేట మండలం పెద్దతుమ్మలగూడెం గ్రామానికి చెందిన భక్తులు అగ్నిగుండంలో మొదటి నడకతో ప్రారంభించారు వారు తెచ్చిన ప్రభ భక్తులను విశేషంగా ఆకర్షించింది. పాప పరిహారంగా భావిస్తూ భక్తులు తన్మయత్వంతో శివుని ధ్యాసలో కణకణ మండే నిప్పు కనికలపై నడిచారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు.


అనంతరం స్వామి అమ్మవార్ల విగ్రహాలను కళ్యాణ మండపం నుంచి ఆలయ పురవీధులలో పర్వత వాహన సేవ ద్వారా మహా మండపంలోకి తీసుకెళ్లి దీక్ష హోమములు, రుద్రాభిషేకములు తదితర ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. గురువారం ఉదయం తెల్లవారుజామున ధోపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

స్వామివారి కట్నాల హుండీ లెక్కింపు
చెరువుగట్టు జాతరలో స్వామివారి కళ్యాణం సందర్భంగా భక్తులు సమర్పించిన కట్నాల హుండీల లెక్కింపును బుధవారం చేపట్టారు. కళ్యాణ కట్నాల హుండీ ఆదాయం 5,56,747/- రూపాయలు అగ్ని గుండాల రోజు కట్నాల ఆదాయము 65,949/- రూపాయలు మొత్తం 6,22,696/- రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు.


అగ్నిగుండాలలో నడిచేందుకు క్యూ లైన్ వద్ద భారీగా నిలుచున్న భక్తులు

అగ్నిగుండంలో తన్మయత్వంతో శివుని ధ్యాసలో భక్తుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *