
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 22: ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వ్యాపారులు నాణ్యతలేని సరుకులను తక్కువ ధరకు స్థానిక ప్రజలకు విక్రయించి కోట్లాది రూపాయలు లాభార్జన చేస్తున్నారని నార్కెట్పల్లి వర్తక వ్యాపారాల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఓయూజేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం నార్కట్పల్లి పట్టణంలో ఆ సంఘం తరఫున దుకాణాల బంద్ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊర- మన దుకాణం అనే నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సంఘ నాయకుడు బోడ వెంకన్న మాట్లాడుతూ స్థానికులకు నాణ్యతలేని వస్తువులను విక్రయించి తీవ్ర నష్టం చేకూరుస్తున్న ఇతర రాష్ట్రాల వ్యాపారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు చేసుకున్న వ్యాపారాల వల్ల స్థానికులకు ఏమాత్రం లాభం లేదని వారి షాపులలో కనీసం స్థానిక యువతకు ఉపాధి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. మన సొంత అన్న చెల్లి తమ్ముడు బావ తదితరులు ఏర్పాటు చేసుకున్న దుకాణ సముదాయాలలో వస్తువులను కొనుగోలు చేయకుండా ఇతరుల వద్ద కొనుగోలు చేయడం వల్ల మనకు మనమే నష్టపోతున్నామని ఇకనైనా స్థానిక ప్రజలు ఆలోచించి ఒకరికొకరం సహకరించుకొని అందరం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొప్పు అంజన్ కుమార్, కార్యదర్శులు బోయపల్లి శ్రవణ్, పసునూరి శివరాం, గజ్జల వెంకట్, పల్లెర్ల నాగరాజు, మహేందర్ చారి, శ్రీను, దశరథ, ఉపేందర్, లింగస్వామి, సంతోష్, సత్యం, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
