
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు వేదాగమసార్వభౌమ, శైవాగమచతురానన, వేదాక్షర సరస్వతి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితావథాని ఆచార్యత్వమున ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, శైవాగమ పండితులచే శాస్త్రోక్తముగా యాగశాల ప్రదక్షిణ, గణపతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకము, పుణ్యాహవాచనము, ప్రోక్షణ, దీక్షాధారణ, అఖండ స్థాపన తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వివిధ రకాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రతిసారి ఇబ్బంది పడే పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భక్తులు కూడా సౌచాలయాలు (మూత్రశాలలు) వినియోగించుకొని గట్టుపైన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది చెప్పిన విధంగా నడుచుకొని వారికి సహకరించాలని కోరారు.
విద్యుత్తు అంతరాయం లేకుండా జనరేటర్ల ఏర్పాటు
స్వామివారి బ్రహ్మోత్సవం సందర్భంగా అనుకోకుండా సంభవించే విద్యుత్తు అంతరాయాలను నిర్మూలించేందుకు ప్రత్యేకంగా రెండు జనరేటర్ లను గుట్టపైన శివుని విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు.

ఆదివారం సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో అంకురార్పణ, ప్రధాన కళాశారాధన, మూల మంత్ర హోమములు, ద్వజారోహణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
సోమవారం తెల్లవారుజామున నిర్వహించే స్వామివారి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తలంబ్రాల బియ్యం నూతన పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి మోహన్ బాబు, తహసిల్దార్ వెంకటేశ్వరరావు, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ వారాల రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తుల ఊశయ్య, చెరువుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణయ్య, ఉత్సవ కమిటీ నాయకులు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కమ్మలపల్లి మల్లేష్, మర్రి లింగస్వామి, ఇడుకుల్ల సంపత్, నాయకులు బండ సాగర్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామివారి కల్యాణానికి సిద్ధమౌతున్న కళ్యాణమండపం
