
నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని గురిజ అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తిశ్రద్ధలతో యంత్రస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ దేవి, కాళీమాత దేవి విగ్రహల ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 30 అడుగుల రాత్రి ధ్వజస్తంభం ప్రతిష్టించే సమయంలో భక్తుల తన్మయత్వంతో ఎల్లమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రేణుక ఎల్లమ్మ-జమదగ్ని మునిరాజు ల శాంతి కళ్యాణం శతాధిక ప్రతిష్టాచార్యులు బేతోజుసత్యనారాయణ శాస్త్రి చేతుల మీదుగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం గోవుకు వృషభానికి కళ్యాణం జరిపించారు.

ప్రజలందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎమ్మెల్యే వేముల వీరేశం
నూతన దేవాలయంలో సతీసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా అమ్మవారి ఆజ్ఞ మేరకు భక్తులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న అశోక్ స్వామి నూతన దేవాలయ నిర్మాణంతో భక్తులకు తమ ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా వేడుకునే అవకాశాన్ని కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉశయ్య, సిద్ధ గొని స్వామి, బింగి కొండయ్య, జేరిపోతుల భరత్, గడ్డం పశుపతి, జాల సైదులు మంజుల, గురుజ రాములు, ప్రజ్ఞాపూర్ సత్యనారాయణ, మాదాసు నరసింహ, సలీం స్వామి తదితరులు పాల్గొన్నారు.

