
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 3: నార్కెట్పల్లి పట్టణంలో అసంపూర్తిగా నిర్మించిన మెయిన్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ గురువారం నార్కెట్పల్లి మండల బిజెపి అధ్యక్షులు మేడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు నార్కెట్పల్లిలోని రెడ్డయ్య ఫ్యాక్టరీ నుంచి కామినేని జంక్షన్ వరకు రహదారి నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణదారులు దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించి రోడ్డు పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రోడ్డు నిర్మాణ ఇదేవిధంగా జాప్యం చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నార్కట్పల్లి ప్రజల సహకారంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఉపాధ్యక్షులు నోముల నాగరాజు, మల్లెబోయిన రామలింగం, ప్రధాన కార్యదర్శి బిల్లకంటి శ్రీకాంత్, నాయకులు వడ్డేగోని రామలింగం, నడింపల్లి పార్థసారథి, పాలకూరి రమేష్, పామనగుండ్ల శివ, చెరుకు శివ, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
