స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 16: నార్కెట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కెట్పల్లి) కృషి చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు మామిళ్ల సత్తిరెడ్డి పేర్కొన్నారు. SSC 2024 సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ తరఫున ఏర్పాటుచేసిన సన్మాన సభలో ప్రథమ స్థానంలో నిలిచిన ఫిర్దోస్ కౌసర్ కి 10 వేల రూపాయల ప్రోత్సాహక బహుమతి 2వ స్థానంలో నిలిచిన ముగ్గురు సిద్ధార్ధ్, సిందుజ, ఇంద్రజ లకు 2000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి షీల్దులు అందజేశారు. అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులలో ఉత్తమ అటెండెన్స్, స్టేజ్ పెర్ఫార్మెన్స్, డాన్స్ తదితర అంశాలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేదలైన విద్యార్థులకు అన్ని రకాలైన వసతులను సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తూ, వారు క్రమశిక్షణతో చదువుకునేందుకు తోడ్పడుతూ, ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సంస్థ ప్రతినిత్యం కృషి చేస్తుందని తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం పిల్లలకు డాన్స్ మాస్టర్ ని ఏర్పాటు చేసినట్లయితే అతనికి జీతం తనే చెల్లిస్తానని, అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో స్నాక్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావిస్తున్నానని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని పేర్కొన్నారు.
ప్రధానోపాధ్యాయుడు రాములు మాట్లాడుతూ వసతుల లేమి తో బాధపడుతున్న పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్న స్వాన్ సంస్థ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల మిగతా విద్యార్థులు స్ఫూర్తి పొందే అవకాశం ఉందని ఇదే స్పూర్తితో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ బడులలో వసతులు సరిగా ఉండవనే కారణంతో ప్రజలు తమ శక్తికి మించి ఖర్చు చేస్తూ ప్రైవేటు బడులను ఆశ్రయిస్తున్నారని మన పాఠశాలలో ఈ సంవత్సరం మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రజలను భాగస్వాములను చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో ఇంటికి 100 – బడికి చందా అనే కార్యక్రమంతో ముందుకు వెళ్లి వచ్చిన చందాలతో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. బడిలో ఉన్న పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించి ప్రహరీ గోడ ఎత్తు పెంచేందుకు10 లక్షల రూపాయలు కేటాయించిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, ఊరి ప్రజల సహకారంతో ప్రభుత్వ బడిని కాపాడుకొని విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడిని గ్రామ ప్రజలందరూ తమ అందరి ఆస్తిగా భావించి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వాన్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.