బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ను పూర్తి స్థాయిలో నింపండి.
రిజర్వాయర్ కింద 50 చెరువులు నింపే లెఫ్ట్, రైట్ కెనాల్స్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి.
దోమలపల్లి కి 10 రోజుల్లో సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలి.
ఫీడర్ చానల్ కెనాల్స్ తవ్వకానికి ఎస్టిమేట్స్ రూపొందించండి.
భూ సేకరణ కింద రైతులకు అందాల్సిన పరిహారం వెంటనే చెల్లించాలి.
బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ కింద లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడమే నా ధృఢ సంకల్పం
బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, జులై19:
బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ద్వార లక్ష ఎకరాలకు సాగునీరు అందించే వరకు విశ్రమించబోనని రాష్ట్ర ఐటీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం బ్రాహ్మణ వెళ్లే గ్రామంలో తన చిన్నాన్న కోమటిరెడ్డి కృష్ణారెడ్డి దశదినకర్మకు హాజరైన అనంతరం ప్రాజెక్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ లో రెండు పంపుల ద్వారా ఇప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. ఉదయసముద్రం నుండి ఇప్పటి వరకు 0.20TMC నీటిని లిఫ్ట్ చేశామని అధికారులు మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్ లో నీటిమట్టం పెరుగుతున్నందున రెండు పంపుల ద్వారా ఒక్కో పంపు 460క్యూసెక్కుల కెపాసిటీ చొప్పున రోజుకు 920 క్యూసెక్కుల నీటిని ఉదయసముద్రం నుండి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ లెవల్ 0.305TMC వరకు నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ కింద చెరువులు నింపి సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న లెఫ్ట్, రైట్ కెనాల్ పనుల పురోగతి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా 30చెరువులు, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 20చెరువులు నింపేందుకు వీలుగా వర్క్ ఏజెన్సీలు యుద్ద ప్రాతిపదికన కెనాల్ పనులు పూర్తి చేయాలన్నారు. రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించే ఫీడర్ చానెల్ కెనాల్ తవ్వకానికి ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ మండలం దోమలపల్లి గ్రామ చెరువు 10రోజుల్లో నింపి సాగు నీరు అందించేందుకు నిర్విరామంగా పని చేయాలని, కెనాల్స్ పినిషింగ్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు.ప్రాజెక్ట్ కింద భూసేకరణ ద్వారా భూమి కోల్పోయిన రైతుల ఖాతాల్లో వెంటనే పరిహారం డబ్బులు జమ చేయాలని ఆర్డీవో,అడిషనల్ కలెక్టర్ ను ఫోన్లో ఆదేశించారు. గత డిసెంబర్ లో ప్రారంభించుకున్న ఈ రిజర్వాయర్ ద్వారా ఇప్పటి వరకు 15వేల ఎకరాలకు సాగు నీరు అందించామని,లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన ధృఢ సంకల్పమని మంత్రి పునరుద్ఘాటించారు. మంత్రి ఆకస్మిక తనిఖీ కి వెళ్లినప్పుడు ఫీల్డ్ విజిట్ లో ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లను ఈ సందర్భంగా అభినందించారు. రైతు పట్ల ప్రతి ఒక్కరూ కమిట్మెంట్ తో పనిచేయాలని వారికి సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా నల్గొండ ఇరిగేష్ ఈ.ఈ శ్రీనివాస్ రెడ్డి, డి.ఈ విఠలేశ్వర్,డిప్యూటీ డి.ఈ పిచ్చయ్య,ఏ.ఈఈలు రాజశేఖర్,నవీన్,జితేందర్ తో పాటు పలువురు ఉన్నారు.
