
స్వేచ్ఛ న్యూస్, జులై 5, నార్కెట్పల్లి: విద్యార్థులు మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని నషాముక్త్ భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం నార్కెట్పల్లి లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ మూసి ప్రాజెక్ట్ గురుకుల కళాశాలలో మిషన్ పరివర్తన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల పై అవగాహన సదస్సులో అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో మత్తు పానీయాలు, సిగరెట్లు, మాదకద్రవ్యాలు తదితర అనారోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే అన్ని విషయాలను క్రమశిక్షణతో విని ఆచరించి స్పష్టమైన గోల్ ఏర్పాటు చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ముత్తు పదార్థాలు సేవించడం వలన ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు మన కళ్ళ ముందల కనిపిస్తున్నాయని తెలిపారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకునే ఈ దశలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా శ్రద్ధతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది సుధాకర్, ఉపేందర్ రెడ్డి, భార్గవి, వీరయ్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
