స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 12: శ్రీ విజయ భారతి నాట్యమండలి (సురభి నాటకాలు) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈనెల 13 నుంచి 15 వరకు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనున్నట్లు శ్రీ విజయ భారతి నాట్యమండలి కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నార్కెట్పల్లిలోని సురభి డ్రామా థియేటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1975 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామంలో వనారస దామోదర్ రావు చేతుల మీదుగా స్థాపించబడి గత 49 సంవత్సరాలుగా అనేక గ్రామాలలో థియేటర్లను ఏర్పాటు చేసుకొని ఎన్నో ప్రదర్శనలు చేసినట్టు తెలిపారు. గత 16 సంవత్సరాలుగా 30 మంది కళాకారులతో నార్కెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న డ్రామా థియేటర్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత కాలంలో టీవీలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ మాధ్యమాల ప్రభావం వల్ల వీధి నాటకాలు, బాగోతాలు, యక్షగానాలు తదితర కలలు కనుమరుగైపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరంగా కళాకారులను గుర్తించి అధికారికంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కలలపై ఆధారపడ్డ మాలాంటి ఎన్నో కుటుంబాలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మా సంస్థ 50వ వడిలోకి అడుగీడుతున్న సందర్భంగా ఈనెల 13న డాక్టర్ కె.వి రమణాచారి దీవెనలతో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆశిస్తులతో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి సౌజన్యంతో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకోనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చేతుల మీదుగా వేడుకలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 13వ తేదీ బుధవారం మాయాబజార్, 14వ తేదీ గురువారం మాయల మరాఠీ, 15వ తేదీ శుక్రవారం భక్త ప్రహ్లాద నాటకాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.