
స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 7, నార్కెట్పల్లి: భగభగ మండే నిప్పు కనికల్లో ఓం నమశ్శివాయ నీవే రక్ష అంటూ శివనామ స్మరణలతో చెరువుగట్టు క్షేత్రం మార్మోగిపోయింది భక్తులు పరవశించిపోయారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేద పారాయణం చేస్తుండగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
వీరముష్టి వంశస్థుల ఆనవాయితీ

స్వామి వారి అగ్నిగుండాలు కార్యక్రమానికి ఆనవాయితీ ప్రకారం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం (పెద్ద తుమ్మల గూడెం) గ్రామానికి చెందిన వీరముష్టి వంశస్థుడు భీమయ్య గుమ్మడికాయ కొట్టి ప్రారంభించి ప్రధాన అర్చకునితో పాటు అగ్ని కనికలపై నడిచారు. అనంతరం భక్తులు, దేవాదాయ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు అందరు అగ్నిగుండాలలో నడిచి స్వామివారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలలో కళ్యాణం తర్వాత అత్యంత ప్రాశస్త్యం కలిగిన అగ్నిగుండాలి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవ పరిశీలకుడు కృష్ణ, ఈవో నవీన్ కుమార్, దేవాలయ సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, మహేందర్ రెడ్డి, నరేష్, యాదగిరి, నాయకులు గడుసు శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భక్తులను అలరించిన పర్వత వాహన సేవ

స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమం ముందు స్వామివారిని మాడవీధులలో పర్వత వాహనంపై ఊరేగింపుగా తీసుకువచ్చిన సందర్భంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రరవశించిపోయారు.
స్వామివారి కట్నాలు ఒక లక్ష మూడు వేలు
స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భక్తులు స్వామివారికి సమర్పించిన కట్నాలు 1,03,350/-రూపాయలు వచ్చినట్లు ఈవో నవీన్ తెలిపారు.
పోలీసు సిబ్బందికి సన్మానం

చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రతిక్షణం పహారాకాస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందిని ఈవో నవీన్ కుమార్ సన్మానించారు.
