
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 9: భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తులను మూడు రకాలుగా విభజించుకొని తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారులకు సూచించారు. బుధవారం నార్కెట్పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ భూభారతి దరఖాస్తులను ఆమోదించినవి, తిరస్కరించినవి, సాదాబైనామ లుగా విభజించాలని ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఆయా దరఖాస్తులకు పరిష్కార మార్గాలు చూడాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు శాశ్వత పరిష్కారంగా భూభారతి ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించమని హెచ్చరించారు. అదేవిధంగా రేషన్ కార్డులు పెన్షన్స్ దరఖాస్తుల పై ఆరా తీశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.
అనంతరం మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ దరఖాస్తుదారుల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని ఎవరివద్దనైనా ఎక్కువ అమౌంట్ తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
పురుగు మందుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రైతులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని ఆఫ్ లైన్ ద్వారా విక్రయించరాదని నిర్వాహకులకు సూచించారు. స్టాక్ నిర్వాహణలో ఎలాంటి అవకతవకలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. స్టాక్ నిల్వ ఉంచిన గోడౌన్ ను కూడా తనిఖీ చేశారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ బాల బాలికలకు వేరువేరు మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో తగు సూచనలు చేశారు. నాలుగు తరగతి గదులకు మరమ్మతులు చేయాల్సిన విషయాన్ని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా విద్యాధికారి బిక్షపతి, డీఎస్ఓ వెంకటేశం, మత్స్య శాఖ ఏడి సరిత, నార్కట్పల్లి తాసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
