అంగరంగ వైభవంగా ఆది దంపతుల కళ్యాణం

తాళిబొట్టును బక్తులకు చూపుతున్న పండితులు

జన గట్టు పై జన ప్రవాహం

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: ఆదిదంపతులు అయిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం సోమవారం చెరువుగట్టులో తెల్లవారుజామున లేలేత సూర్యకిరణాలు స్పృశిస్తున్న రథసప్తమి గడియలలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు ఒకవైపు, హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల హర్షద్వానాలు మరోవైపు, శివసత్తుల శివనామ: స్మరణలు ఇంకోవైపు మారు మ్రోగుతుండగా పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి ఆచారత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ కరకమలమూలచే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ తంతు నిర్వహించారు.
తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి కళ్యాణం మండపానికి తీసుకొస్తున్న సమయంలో ఆగమ శాస్త్ర ఆచారం ప్రకారం నిర్వహించిన ఎదుర్కోలు కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. కళ్యాణ మండపంలో ఆసీనులైన ఆదిదంపతులకు కళ్యాణ తంతులో భాగంగా అర్చకులు పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రాంత శుద్ధి చేసిన అనంతరం కళ్యాణంలో ఉపయోగించే ద్రవ్యాలను సంప్రోక్షణ చేసి కాళ్లు కడుగు కార్యక్రమం, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి క్రియను భక్తులకు శ్రీకాంత్ శర్మ తన వాగ్దాటితో వివరించిన విధానం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం స్వామి అమ్మవార్ల కు అర్చకులు ఒడి బియ్యం, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి అమ్మవార్లకు తమ పంటలోని ద్రవ్యాన్ని ఒడిబియ్యంగా తయారు చేసుకొని స్వామి అమ్మవార్లకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

నూతన పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.


విలువ లేని ఎంట్రీ పాసులు:

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో గుట్ట పైకి వచ్చే వాహనాలను, అదేవిధంగా కళ్యాణ మండపం పరిధిలోకి వచ్చే భక్తులను కట్టడి చేయడం కొరకు పలు రకాల ఎంట్రీ పాసులను అందజేశారు. ఈ ఎంట్రీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడంతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి తలనొప్పిగా మారింది. దీనివల్ల నిజమైన ఎంట్రీ పాస్ కలిగిన వారిని కూడా పోలీసులు ఆపడంతో పోలీసులకు పాసులు తీసుకున్న వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్హులైన వారిని లోపలికి పంపించకపోవడంతో జారీచేసిన పాసులకు విలువ ఏముందని, ఇంత మాత్రానికి పాసులు ఇవ్వడం ఎందుకని పోలీసులను ప్రశ్నించారు. పోలీసు సిబ్బందికి తెలిసిన వారి పట్ల ఒక విధంగా, తెలియని వారిపట్ల మరో విధంగా ప్రవర్తిస్తూ మమ్ములను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పాసులు లేకున్నా సిబ్బంది బంధుమిత్రులను పంపిస్తున్నారని ఆరోపించారు.

కంకణాలు కట్టలేదని భక్తుల ఆగ్రహం:
కళ్యాణ మహోత్సవం సందర్భంగా 1000 రూపాయల టికెట్ తీసుకొని స్వామివారి కల్యాణంలో కూర్చున్న దంపతులను పట్టించుకునే వారు లేరని కనీసం కంకణాలు కూడా అందించలేదని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి వద్ద రాజకీయాలకు తావు లేకుండా భక్తులందరినీ సమానంగా చూడాలని కోరారు.

శంఖం ఊదుతూ శంకరునికి నీరాజనాలు అందజేస్తున్న భక్తుడు

ముత్యాలు పొదిగిన గంపలలో స్వామి అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పిస్తున్న శివసత్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *