
స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 17 : వైద్య వృత్తిలో లక్షలాది ప్రాణాలను కాపాడే అత్యవసర (కాజువాలిటీ) వైద్యం లో డ్యూటీలో ఉన్న నర్సులది చాలా కీలకమైన పాత్ర అని తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ కం ఇన్చార్జ్ రిజిస్టార్ డాక్టర్: విద్యుల్లత పేర్కొన్నారు.
శనివారం నార్కెట్పల్లి కామినేని వైద్య కళాశాలలో నర్సింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ నర్సింగ్ కేర్ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల ప్రమాదాలతో, రోగాలతో ఆసుపత్రిలో చేరిన వెంటనే రోగికి సంబంధించిన పూర్తి సమాచారం, జరిగిన ఘటన, అందించాల్సిన వైద్యం, రోగి బంధువులతో మాట్లాడే విధానం, వైద్యానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో మెలగాలని సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలలో గాయపడిన రోగులకు మొదటి గంట అనేది గోల్డెన్ అవర్ గా వ్యవహరిస్తామని అలాంటి సమయంలో సమయాన్ని వృధా చేయకుండా సాధ్యమైనంత మేరకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు డాక్టర్ తో పాటు నర్సుల సహకారం ఎంతో అవసరం ఉంటుందని తెలిపారు. రోగి బంధువులతో మాట్లాడేటప్పుడు, ఆరోగ్య పరిస్థితిని, చికిత్స కు సంబంధించిన అంశాలను వివరించేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఇలాంటి కాన్ఫరెన్స్ లకు హాజరయ్యి మెరుగైన వైద్య సేవలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. సుమారు 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం సంతోషదాయకమన్నారు. సహనంతో వ్యవహరించడం, సరైన సమాచారాన్ని అందించడం, రోగుల పట్ల మానవతా దృక్పథం కలిగి ఉండడం అంతిమంగా రోగి ప్రాణాలు కాపాడేందుకు సహకరించడం నర్సుల ప్రాథమిక విధి అని సూచించారు.
అనంతరం పీడియాట్రిక్స్, కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలలో వర్క్ షాపులు నిర్వహించి ఆయా విభాగాలలో వైద్యం చేయు విధానంపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా: బాబా సాహెబ్ లక్ష్మణ్ సింగ్, కిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డా: పి.వి రామ్మోహన్, ఆర్గనైజింగ్ చైర్ పర్సన్, కిమ్స్ నర్సింగ్ సూపర్డెంట్ డా: సునీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ శైలజ, సైంటిఫిక్ కమిటీ మెంబర్ డాక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

