రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత – ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలి ..

WhatsApp Image 2026 11 19 at 14.40.13 2

  • కామినేని వైద్యకళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ..
  • హెల్మెట్ ధరించని వారికి ప్రమాదం పొంచి ఉన్నట్లే – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ..

స్వేచ్చ న్యూస్, నార్కెట్ పల్లి, నవంబర్ 19: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత  అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.

కామినేని వైద్య కళాశాలలోని 2023 బ్యాచ్ ఇన్ ప్రింట్స్ – 2026 ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న మెడికల్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా గురువారం కామినేని వైద్యశాలలోని గిరిధర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 2 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది, నల్లగొండ జిల్లాలో సుమారు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా చిట్యాల వద్ద ఆటో, లారీ మధ్య జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన రోడ్డు ప్రమాదాల తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. వాహనాలను అతివేగంగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలని, రహదారిపై ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. కొద్దిపాటి నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చే ప్రమాదం ఉందని, ప్రయాణం ఎంత దూరమైనా భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు రహదారిపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోడ్డు భద్రత, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం, నిబంధనలు పాటించడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయకుండా విద్యార్థులతో ఎస్పీ ప్రతిజ్ఞ  చేయించారు.

WhatsApp Image 2026 11 19 at 14.40.12

అదేవిధంగా డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్‌కు బానిసై తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు డ్రగ్స్‌కు బానిసైన సుమారు 500 మందిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తుపై  దృష్టిసారించి మంచి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని తద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. కళాశాలలో, విద్యాసంస్థలు తమ పరిధిలో డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని, విద్యార్థుల ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఇన్ ప్రింట్స్ – 2026 ఫెస్ట్ చైర్మన్ డాక్టర్ రఘునందన్ ఆర్థిక సహకారంతో ద్విచక్ర వాహనాలు నడిపే కామినేని వైద్యశాల ఉద్యోగులకు జిల్లా ఎస్పీ ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేశారు.

WhatsApp Image 2026 11 19 at 14.48.11

అనంతరం విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి కామినేని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ ని యస్పి జెండా ఉపి ప్రారంబించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, సురక్షిత ప్రయాణం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎస్పీ కోరారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా గుర్తించాలని. మన జాగ్రత్తే మన కుటుంబానికి భరోసా అని ఎస్పీ పేర్కొన్నారు.

WhatsApp Image 2026 11 19 at 14.40.13 1

ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్.బి సీఐ నాగరాజు, నార్కట్ పల్లి ఎస్.ఐ వెంకటేశ్వర్లు, డిటిఆర్బి ఇంచార్జ్ రిటైర్డ్ సీఐ అంజయ్య, కామినేని వైద్యశాల అధ్యాపకులు,ప్రిన్సిపాల్ బాబాసాహెబ్ లక్ష్మన్ సింగ్, సూపర్డనెంట్ డా వెంకటరామ్ మోహన్, వైస్ ప్రిన్సిపాల్ సతీష్, డా రఘనందన్, ఎస్టేట్ మేనేజర్ అంజయ్య, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *