గతించిన క్షణాన్ని జ్ఞాపకంగా మల్చడమే ఫోటోగ్రాఫీ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 19: 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండలంలో ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ కెమెరా సృష్టికర్త డాక్టర్ లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని మునుగోడు రోడ్డు చౌరస్తా నుంచి అమ్మనబోలు రోడ్డు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలోని విలువైన క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మలిచి పది కాలాలపాటు పదిలంగా ఉంచే శక్తి కేవలం ఒక ఫోటోగ్రాఫర్ కు మాత్రమే ఉన్నదన్నారు. కదులుతున్న కాలంలో రెప్పపాటు క్షణాన్ని చిత్రీకరించి గత చరిత్రకు సాక్షాలను భద్రపరచడం ఒక్క ఛాయాచిత్రానికే సాధ్యపడుతుందన్నారు. అలాంటి ఆనంద క్షణాలను ఒడిసి పట్టేందుకు అనుక్షణం తపనతో పోరాడే వ్యక్తి ఫోటోగ్రాఫర్ అని కొనియాడారు. అందరి ముఖంలో చిరునవ్వును కోరుకునే ఫోటోగ్రాఫర్ నేడు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడలేక పాత సాంకేతికతను వాడలేక ఎంతో సంఘర్షణకు లోనవుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి తెచ్చుకున్న కొత్త కెమెరా ఆరు నెలలు తిరిగేలోపే దాన్ని మించిన మరో కెమెరా రావడం వల్ల ప్రతిరోజు మార్కెట్ తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన గౌరీ దేవి నరసింహ, సోమ వెంకటరెడ్డి, పల్లె తిరుమల్, కొమ్మ గిరి, ముంత వెంకన్న, దంతూరి సతీష్, ఉప్పునూతల శేఖర్, సత్యనారాయణ, వెల్లంల వెంకన్న, నడిగోటి శ్రీనివాస్, అశోక్, కార్తికు, శ్రీమన్నారాయణ, లింగస్వామి, నరేష్, వినోద్, సతీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *