
స్వేచ్ఛ న్యూస్, మార్చి 29, నార్కెట్పల్లి: ప్రకృతితో మమేకమై పంచభూతాలతో అనుసంధానమై జీవించే జీవన విధానమే హైందవ సంస్కృతి అని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ నక్క నాగరాజు పేర్కొన్నారు. శనివారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ చేతన పాఠశాల గ్రౌండ్ లో ఆర్ఎస్ఎస్ నార్కెట్పల్లి శివాజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా ప్రకృతిలో జరిగే అనేకమైన మార్పులు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు ఉగాది రోజు నుంచి వసంత రుతువు ప్రారంభమవుతుందని ఈ రుతువు లో భూమి మీద ఉన్న చెట్లని ఆకురాల్చి కొత్త చిగురుతో చెట్లు చిగురిస్తాయని తెలిపారు. ప్రకృతితో మమేకమైన మానవుని జీవనశైలిలో ఉగాది నుంచి ప్రకృతిలో వచ్చే మార్పుతో మానవుని జీవితం ఆధారపడి ఉందని తెలిపారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఉగాది ని హైందవ సంస్కృతిలో నూతన సంవత్సరంగా పేర్కొంటారని తెలిపారు. జనవరి నెలలో ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరగవని కేవలం ప్రాచ్ఛాత్య సంస్కృతిలో భాగంగా వారికి అనుకూలంగా ఉండే విధంగా జనవరి ని నూతన సంవత్సరంగా ప్రపంచానికి అంటగట్టారని దుయ్యబట్టారు. వేల సంవత్సరాల క్రితమే ఋషులు ఎంతో ముందు జాగ్రత్తగా గ్రహాల స్థితిగతులను లెక్కించి పంచాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కాలానికి మార్గ నిర్దేశం చేసిన ఘనత హిందూ ఋషులకు చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నూకల విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశమే ప్రథమం మిగతావన్నీ తర్వాత అనే నినాదంతో ఆర్ఎస్ఎస్ ప్రజలలో దేశభక్తిని నింపి ఎక్కడ ఎలాంటి ఆపదలు వచ్చినా వారికి సేవలందించే విధంగా యువకులను తీర్చిదిద్దుతుందన్నారు. ఉదాహరణకు ఇటీవల కేరళ రాష్ట్రం వయనాడు ప్రాంతంలో వరద ఉధృతిలో అనేకమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మొట్టమొదటిగా వెళ్లి కులమత బేధాలు లేకుండా సేవలందించిన ఘనత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దక్కుతుందన్నారు.

అనంతరం కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నార్కెట్పల్లి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

